: విదేశీ ఆస్తులపై ప్రశ్నిస్తే చిర్రుబుర్రులాడిన ఐశ్వర్యా రాయ్
ఇటీవల విడుదలైన 'పనామా పేపర్స్'లో మీ పేరు కూడా వచ్చిందిగా? మీ స్పందనేంటి? అని అందాల నటి ఐశ్వర్యారాయ్ ని ఓ విలేకరి ప్రశ్నించిన వేళ ఆమె అసహనాన్ని వ్యక్తం చేస్తూ చిర్రుబుర్రులాడారు. ఆమె నటించిన తాజా చిత్రం 'సరబ్ జిత్' ట్రయిలర్ విడుదల కార్యక్రమం ముంబైలో జరుగగా, దీనికి హాజరైన మీడియా విదేశీ ఆస్తుల గురించిన ప్రశ్నలను సంధించింది. తొలుత సమాధానమివ్వని ఐశ్వర్యకు మద్దతుగా నిలిచిన రణదీప్ హుడా, కేవలం సినిమాకు సంబంధించిన ప్రశ్నలే అడగాలని సూచించాడు. అయినా మీడియా పట్టించుకోకుండా ప్రశ్నలు అడగడంతో, ఐశ్వర్యకు కోపం తన్నుకొచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశామని, ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని రుసరుసలాడింది. ఇక ఆమె మేనేజరైతే మరో అడుగు ముందుకేసి, ప్రకటన చూసుకోండి, పొండి అంటూ ప్రశ్నించిన పత్రికా ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. పనామా పేపర్స్ వివరాల ప్రకారం, ఐశ్వర్యతో పాటు ఆమె మామ అమితాబ్ సహా సైఫ్, కరీనా, కరిష్మా తదితర బాలీవుడ్ సెలబ్రిటీలు విదేశాల్లో నల్లధనం దాచుకున్నట్టు వెల్లడైన సంగతి తెలిసిందే.