: అంబేద్కర్ సమానత్వం, గౌరవం కోసం పోరాడారు: 'మవు'లో నరేంద్ర మోదీ
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా దేశంలో కొన్ని గ్రామాలకు ఇంకా విద్యుత్ లేదంటే ఆశ్చర్యం కలగక మానదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మించిన మధ్యప్రదేశ్ లోని 'మవు'లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఇంకా 18000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని అన్నారు. ఎలక్ట్రిక్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్ లతో దేశం ముందుకు వెళుతున్న తరుణంలో విద్యుత్ అందని ప్రాంతాలున్నాయంటే ఎంత వెనుకబాటుతనంలో ఉన్నామో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని ఆయన అన్నారు. సమానత్వం, గౌరవం కోసం అంబేద్కర్ పోరాడారని ఆయన గుర్తుచేసుకున్నారు. దేశం మొత్తం సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారని ప్రధాని అన్నారు. అంబేద్కర్ బాటలో నడవాలంటే ముందు దేశం అభివృద్ధి చెందాలని ఆయన చెప్పారు. అంబేద్కర్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ, 'విద్యావంతులు కండి, ఐకమత్యంతో ఉండండి, అలా ఉంటే అభివృద్ధి చెందుతా'రని అన్నారని ఆయన చెప్పారు.