: మిత్రులారా, శాంతించండి...పాపం ఆయన చెప్పులు పోగొట్టుకున్నాడు: భజరంగ్ దళ్ 'చెప్పుదాడి'కి కన్నయ్య సమాధానం
జేఎన్యూ స్టూడెంట్ లీడర్ కన్నయ్య కుమార్ నాగపూర్ లో పాల్గొన్న సభలో భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. సభలో కన్నయ్య కుమార్ మాట్లాడుతుండగా, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయనపై చెప్పు విసిరారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కన్నయ్య సభికులనుద్దేశించి మాట్లాడుతూ, శాంతించాలని, తనపై చెప్పు విసిరిన వ్యక్తి చెప్పులు పోగొట్టుకున్నాడని అన్నారు. జేఎన్యూ, హెచ్సీయూ ఆందోళనల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తన చెప్పులు పోయిన సంగతిని భజరంగ్ దళ్, ఏబీవీపీ సోదరులు గుర్తుంచుకున్నారని, అందుకే తన కోసం చెప్పులు తెచ్చారని ఆయన అన్నారు. 'అయితే భజరంగ్ దళ్, ఏబీవీపీ సోదరులు గుర్తుంచుకోవాల్సిందేంటంటే...బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలా ఒక్కో చెప్పు పారేసుకుంటే కాళ్లు కాలుతాయి, నాపై ద్వేషం పెంచుకున్నా పర్లేదు. కానీ, మీ కాళ్లు కాలకుండా చూసుకోండి. నా మీద ప్రేమతో చెప్పులు పోగొట్టుకోకండి' అని ఆయన చమత్కరిస్తూ మాట్లాడారు.