: చగన్ భుజ్ బల్ కు ఇంటి భోజనం పెట్టండి: కోర్టు ఆదేశాలు
ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజ్ బల్ కు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునే సదుపాయాన్ని కల్పించాలంటూ కోర్టు ఆదేశించింది. ఇంటి నుంచి ఆహారం, మందులు తెప్పించుకునే సదుపాయాన్ని కల్పించాలంటూ భుజ్ బల్ పెట్టుకున్న దరఖాస్తును న్యాయస్థానం అంగీకరించింది. వాటితో పాటు దుప్పటి, వేడి నీళ్లు, ఒక కుర్చీ ఆయనకు ఏర్పాటు చేయాలని జైలు అధికారులను కోర్టు ఈ మేరకు ఆదేశించింది. భుజ్ బల్, అతని బంధువు సమీర్ ల జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక న్యాయమూర్తి పీఆర్ భావ్కే భుజ్ బల్ ను విచారించారు. కాగా, ఈ కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. కాగా, ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ నిర్మాణానికి సంబంధించి నిధుల గోల్ మాల్ విషయంలో భుజ్ బల్, ఆయన కుటుంబ సభ్యులపై రెండు ఎఫ్ఐఆర్ లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫైల్ చేసిన విషయం తెలిసిందే.