: జీతాలు పెంచాంగా... కొంత మొత్తాన్ని ఖజానాకే పంపండి: మోదీ సర్కారు మెలిక!
ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను పెంచినట్టే పెంచిన మోదీ సర్కారు, పెరిగిన వేతనాల నుంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడంద్వారా ఖజానాకు పంపాలని మెలిక పెడుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగిన వేళ, ఈ స్కీమ్ కు ఉద్యోగుల నుంచి మంచి మద్దతు వస్తుందని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా, పెట్టుబడులకు రాబడితో పాటు పన్ను రాయితీలూ చేతికి అందుతాయని, ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ కావచ్చని తెలుస్తోంది. ఆర్థిక శాఖ ప్రతిపాదనల మేరకు, పెరిగిన వేతనాల్లో 50 శాతం బ్యాంకుల బాండ్లు కొనుగోలు చేసేందుకు వినియోగించాల్సి వుంటుంది. ఈ విషయమై గతవారంలోనే చర్చలు సాగగా, ఇప్పటివరకూ అధికారికంగా నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ మొత్తం పెరిగి రూ. 3.61 లక్షల కోట్లకు చేరుకున్న వేళ, ఈ నిర్ణయంతో బ్యాంకుల్లో మూలధన నిధులు పెరుగుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇక ఈ విషయంలో ఉద్యోగ సంఘాల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. వేతన సంఘం సిఫార్సులతో 47 లక్షల మంది ఉద్యోగులకు, 52 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుందన్న సంగతి తెలిసిందే.