: చంద్రబాబు సభలో తెలంగాణ ఎమ్మెల్యే!
పోలవరం ముంపు మండలాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో నిన్న నిర్వహించిన సభలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేశ్వర్లు... చంద్రబాబు సభకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. వెంకటేశ్వర్లు నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు... రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కలిసిన సంగతి తెలిసిందే. ఈ రెండు మండలాలకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారం కోసమంటూ వెంకటేశ్వర్లు తరచూ ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ క్రమంలోనే నిన్నటి చంద్రబాబు సభకు హాజరైన వెంకటేశ్వర్లు... రెండు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏపీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన సభకు వచ్చిన వెంకటేశ్వర్లును చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు ప్రస్తావించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చంద్రబాబు అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.