: జెట్ స్పీడుతో తాత్కాలిక సచివాలయ నిర్మాణం!... 11 గంటల్లో 10 వేల చదరపు అడుగుల శ్లాబ్!
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిధిలో ఇటీవలే మొదలైన తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు జెట్ స్పీడుతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువు కంటే ముందుగానే నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ పనులను దక్కించుకున్న నిర్మాణ రంగ కంపెనీలు ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. ఈ కంపెనీలకు సీఆర్డీఏ అధికారుల మద్దతూ జతకూడటంతో నిర్మాణ పనుల్లో మరింత వేగం నమోదైంది. తాత్కాలిక సచివాలయంలో భాగంగా సీఎం కార్యాలయం సహా, ఐదు కార్యాలయాలకు ఈ నెలాఖరు నాటికి శ్లాబ్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే ఈ గడువు కంటే దాదాపు 20 రోజులు ముందుగానే సదరు పనిని కంపెనీలు పూర్తి చేశాయి. ఆధునిక యంత్రాలతో పిల్లర్లను అనుకున్న గడువు కంటే ముందుగానే కంపెనీలు ఏర్పాటు చేశాయి. మొన్న (మంగళవారం) రాత్రి 10 గంటల సమయంలో సీఎం కార్యాలయానికి శ్లాబ్ ను వేసే ప్రక్రియను మొదలుపెట్టిన కంపెనీలు... బుధవారం ఉదయం 9 గంటల్లోగా ఆ పనిని పూర్తి చేశాయి. అంటే... కేవలం 11 గంటల సమయంలో 10 వేల చదరపు అడుగుల మేర విస్తీర్ణం కలిగిన సీఎం కార్యాలయం శ్లాబ్ ను ఆ కంపెనీలు పూర్తి చేశాయి. ఇదే వేగంతో పనులు కొనసాగితే జూన్ నాటికంటే ముందుగానే తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి కావడం ఖాయమే.