: చంద్రబాబు సొంత పొలంలో ‘ఎర్ర’ డంప్!... పరువు తీస్తున్నారంటూ అధికారులపై సీఎం ఆగ్రహం
తిరుమల వెంకన్న కొలువై ఉన్న శేషాచలం కొండల్లోని విలువైన ఎర్రచందనం వృక్షాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. విదేశాల్లో ఎర్రచందనానికి ఉన్న విలువను గుర్తించిన అక్రమార్కులు అడవిని యథేచ్ఛగా నరికేస్తున్నారు. నిన్నటిదాకా ఈ అక్రమ రవాణాకు అడ్డే లేకుండా పోయింది. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటవీ, పోలీసు శాఖలు ‘ఎర్ర’ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాయి. ఎర్రచందనం దొంగలు భయభ్రాంతులకు గురయ్యేలా ఆ రెండు శాఖలు టాస్క్ పోర్స్ పేరిట ముమ్మర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేసిన సీఎంగా చంద్రబాబుకు పేరొచ్చింది. అయితే మొన్న (మంగళవారం నాడు) విజయవాడలో జరిగిన ఓ సమీక్షలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో అటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు ఆయన కేబినెట్ మంత్రులు షాక్ కు గురయ్యారు. అయినా వారి షాక్ కు కారణమేంటో తెలుసా?... ఎర్రచందనం అక్రమ రవాణాపై సమర శంఖం పూరించిన చంద్రబాబు సొంత పొలంలోనే స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను దాచేశారట. చంద్రబాబుకు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో ఇంటితో పాటు కొంత వ్యవసాయ భూమి కూడా ఉన్న విషయం తెలిసిందే. మొన్న అటవీ శాఖాధికారులు చేసిన దాడుల్లో ఆ పొలంలో భారీ ‘ఎర్ర’ డంప్ బయటపడింది. చంద్రబాబు నోరు విప్పేదాకా ఈ విషయం ఏ ఒక్కరికి తెలియదు. అయితే తన పొలంలోనే ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు తమాయించుకోలేకపోయారు. ఆదాయార్జన శాఖలపై మొన్న జరిగిన సమీక్ష సందర్భంగా ఆయన అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు తన పొలంలోనే ‘ఎర్ర’ డంప్ బయటపడితే... అటవీ శాఖాధికారులు ఏ మేర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేం కష్టపడి పనిచేస్తుంటే... మీరు మాత్రం మా పరువు తీస్తున్నారు. సిగ్గనిపిస్తోంది’’ అని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు కూడా సమాచారం. సమావేశంలో కూర్చున్న అటవీ శాఖాధికారుల వైపు చూడటానికి కూడా ఇష్టపడని చంద్రబాబు... తన బాధను, కోపాన్ని వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.