: వైసీపీకి బొబ్బిలి రాజులు గుడ్ బై!... రేపే టీడీపీలోకి సుజయ, బేబి నాయన


ఏపీలో విపక్ష వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డ పలువురు నాయకులు పార్టీకి హ్యాండిచ్చి అధికార టీడీపీలో చేరారు. ఇప్పటికే ఇలా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. మరికొంత మంది క్యూలో ఉన్నారు. తాజాగా బొబ్బిలి రాజ వంశానికి చెందిన విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు, ఆయన సోదరుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బేబి నాయనలు రేపు టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు నిన్న తమ అనుచరులతో బొబ్బిలి కోటలో సమావేశమైన వీరిద్దరూ పార్టీ మారనున్నట్లు దాదాపు ప్రకటించారు. వారిద్దరి నుంచి అధికారికంగా ప్రకటన రాకున్నా, వారు పార్టీ మారేందుకు మద్దతుదారుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీకి బలమైన నేతలుగా ఉన్న వీరిద్దరు పార్టీకి దూరమైతే... వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గానే కాక దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లలో కీలక మంత్రిగా వ్యవహరించిన బొత్స సత్యనారాయణను వైసీపీలో చేర్చుకుంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నాడే బొబ్బిలి సోదరులు టీడీపీ వైపు చూశారు. అయితే నాడు జగన్ స్వయంగా రంగంలోకి దిగి సర్దిచెప్పడంతో బొబ్బిలి సోదరులు వెనక్కు తగ్గారు. పార్టీలో క్రమంగా బొత్స ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో వారు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ దఫా వారిని నిలువరించేందుకు వైసీపీ నేతలు చేసిన యత్నాలు ఏమాత్రం సఫలం కాలేదని సమాచారం.

  • Loading...

More Telugu News