: బ్రోకర్ మోసం చేశాడు... సౌదీ షేక్ నరకం చూపించాడు: పోలీసులకు బాధిత మహిళల ఫిర్యాదు
సౌదీ షేక్ తమకు నరకం చూపించాడంటూ ఇద్దరు బాధిత మహిళలు, ఒక వ్యక్తి హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు చెప్పిన వివరాలను పోలీసులు తెలిపారు. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో మానవ అక్రమ రవాణా జరిపే బ్రోకర్ మహ్మద్ యాసిన్ ఇద్దరు మహిళలకు, మరో వ్యక్తికి మాయమాటలు చెప్పి, విజిటింగ్ వీసాపై వారిని సౌదీ అరేబియాకు పంపాడు. అక్కడ ఒక షేక్ వద్ద పని చేసేందుకు వీరు కుదిరారు. వీరితో రోజుకు 16 గంటలు చొప్పున పనిచేయించేవాడు. అంతేకాకుండా, శారీరక, మానసిక హింసలు పెట్టేవాడు. ఈ బాధలు తట్టుకోలేని వారు ఎట్టకేలకు ఆ షేక్ బారి నుంచి తప్పించుకుని బయటపడి హైదరాబాద్ చేరుకున్నారు. బ్రోకర్ తమను మోసగించాడన్న విషయం తెలుసుకున్న బాధితులు తమకు ఫిర్యాదు చేశారని సుల్తాన్ బజార్ పోలీసులు పేర్కొన్నారు. సదరు బ్రోకర్ పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.