: మోదీ సర్కారు అండగా నిలిచినప్పటికీ... మాయావతిపై మరో కేసు!
మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఓ సరికొత్త కేసును విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ ఆరోపణల పిటిషన్ ను స్వీకరించాలా? వద్దా? అన్న విషయమై వాదనలు జరుగుతున్న వేళ, కేంద్రం తన వాదన వినిపిస్తూ, కొత్త ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆమెపై ఆరోపణలు రావడం, పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం గమనార్హం. ఇప్పటికిప్పుడు మాయావతికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయలేమని చెప్పిన సుప్రీంకోర్టు పిటిషన్ ను పూర్తిగా పరిశీలిస్తామని చెప్పింది. అంతకుముందు కేంద్రం తరఫున వాదన వినిపించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, ఆదాయపు పన్ను విభాగం ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ ఆధారాలూ లేకుండా మరో ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పిటిషనర్ తదుపరి ఎన్నికల్లో బీఎస్పీ నుంచి టికెట్ ఆశించాడని, తన క్లయింట్ మాయావతి నిరాకరించడంతో ఈ తప్పుడు కేసు పెట్టాడని, దీన్ని కొట్టేయాలని మాయావతి తరఫు న్యాయవాది కోరారు.