: ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నది ముఖ్యం కాదు...పని చేయడం ముఖ్యం: ఖుష్బూ
తమిళనాట ఎన్నికల సందడి నెలకొంది. ఏ పార్టీ తరపున ఎక్కడ? ఎవరు? పోటీలో ఉన్నారు? వారి గెలుపు అవకాశాలేంటి? అన్న విషయాలపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జయలలితకు పోటీగా సినీ నటి ఖుష్బూను ఆర్కేనగర్ నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోందన్న వార్తలపై ఖుష్బూ స్పందించారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెబితే అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు. పోటీ చేయడం, చేయకపోవడం తరువాతి విషయాలని పార్టీ విజయం కోసం పని చేయడం ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. పార్టీని గెలిపించడానికి ఏ పని చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె విధేయత చాటుకున్నారు.