: మార్కెట్లో నేడూ లాభాలే... బడ్జెట్ తరువాత రూ. 11 లక్షల కోట్లకు పైగా లాభపడ్డ పెట్టుబడిదారులు!


భారత స్టాక్ మార్కెట్ పరుగులు వరుసగా మూడవ రోజుకూడా కొనసాగాయి. మంగళవారం నాడు విడుదలైన అభివృద్ధి గణాంకాలకు తోడు, రుతుపవనాల అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచిన వేళ నూతన కొనుగోళ్లు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 480 పాయింట్లకు పైగా లాభపడింది. దీంతో ఫిబ్రవరి 29న బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంటుకు వచ్చిన నాటితో పోలిస్తే సెన్సెక్స్ 2,500 పాయింట్లకు పైగా పెరిగింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీలను నమ్ముకున్న ఇన్వెస్టర్ల సంపద 11.04 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 29న రూ. 85.83 లక్షల కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, నేడు రూ. 96.87 లక్షల కోట్లకు చేరుకుంది. బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 481.16 పాయింట్లు పెరిగి 1.91 శాతం లాభంతో 25,626.75 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 141.50 పాయింట్లు పెరిగి 1.84 శాతం లాభంతో 7,850.45 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.91 శాతం స్మాల్ క్యాప్ 1.06 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 43 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, బీహెచ్ఈఎల్ తదితర కంపెనీలు లాభపడగా, జడ్ఈఈఎల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, అరబిందో ఫార్మా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,840 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,577 కంపెనీలు లాభాల్లోను, 1,106 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. మంగళవారం నాడు రూ. 95,56,921 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఈరోజు రూ. 96,87,793 కోట్లకు పెరిగింది.

  • Loading...

More Telugu News