: అధికారుల చేతివాటం... 'గ్రీన్ టీ' తాగితే లక్షల్లో బిల్లులు... షాక్ తిన్న కేంద్ర మంత్రి!


గ్రీన్ టీ తాగితే మహా అయితే ఎంత అవుతుంది? స్టార్ హోటల్ అయితే, వందో... రెండు వందలో అవ్వచ్చు. అదే బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాత్రం లక్షల్లో బిల్లు వస్తుంది. అది కూడా కేంద్ర మంత్రులకే సుమా! నమ్మశక్యం కాకపోయినా ఇది అక్షర సత్యం. ఆ వివరాల్లోకి వెళితే, కేంద్ర మంత్రులు కర్ణాటక పర్యటనకు వచ్చినప్పుడు వారి బాగోగులను చూసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఆఫీసర్లకు అప్పగిస్తుంది. వారు విమానం ఎక్కి ఢిల్లీ బయలుదేరే వరకు వారికి కావలసినవి వీరు దగ్గరుండి మరీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడే ఈ ప్రోటోకాల్ అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకు కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానంద గౌడ బెంగళూరుకు వచ్చిన ప్రతిసారీ విమానాశ్రయంలోని రెస్టారెంటులో గ్రీన్ టీ మాత్రమే తాగుతారు. అయితే, ఈ నెల ఆయన ఖాతాకు అక్కడి నుంచి వచ్చిన బిల్లు 4 లక్షలు! ఇది చూసి ఆయన షాక్ తిన్నారు. "నేను గ్రీన్ టీ మాత్రమే తాగుతా. అది మహా వుంటే 150 రూపాయలుంటుంది. ఈ నెల బిల్లు చూస్తే నాలుగు లక్షలు వచ్చింది. అంటే, అక్కడి ప్రోటోకాల్ ఉద్యోగులు తప్పుడు బిల్లులు పెట్టి ఎలా మోసం చేస్తున్నారో చూడండి" అంటూ మండిపడ్డారు మంత్రి సదానంద. ఆయనకే కాదు, మరో ఇద్దరు, ముగ్గురు మంత్రుల ఖాతాలకు కూడా ఇలాగే మూడు, నాలుగు లక్షల్లో బిల్లులొచ్చాయట. దీంతో సీరియస్ గా తీసుకున్న కేంద్ర మంత్రులు ఈ స్కాం పై విచారణ జరిపించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా, గతంలో ఈ బిల్లులు 35-40 వేల మధ్యలో ఉండేవి. దాంతో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అవి ఒక్కసారిగా ఇలా లక్షల్లోకి మారిపోవడంతో అధికారుల బండారం బయటపడింది. ఈ తప్పుడు బిల్లుల కుంభకోణంలో చాలా మంది హస్తం వున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News