: రుణాల ఎగవేతలో కేసులో ప్రతివాదిగా ఆర్థిక శాఖ: సుప్రీం కీలక రూలింగ్
ఇండియాలో బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని వాటిని ఎగ్గొడుతున్న వారి సంఖ్య పెరగడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రుణాల ఎగవేత కేసులో ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా భాగం ఉంటుందని స్పష్టం చేసింది. బకాయిల వసూలులో ఆర్బీఐ పాత్ర కీలకమని, కేసులో ప్రతివాదుల జాబితాలో ఫైనాన్స్ మినిస్ట్రీని కూడా చేర్చాలని ఆదేశించింది. ఈ కేసులో బ్యాంకుల సమాఖ్యకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, అందరు ఎగవేతదారుల వివరాలూ అందించాలని పేర్కొంది. అంతకుముందు వాదనలు వినిపించిన ఆర్బీఐ, డిఫాల్టర్ల జాబితాను వెల్లడించవద్దని, వారి పేర్లు చెబితే, సమస్య తీవ్రం కావడంతో పాటు, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని తెలిపింది. వీరి పేర్లను వెల్లడించాలా? వద్దా? అన్న విషయమై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ధర్మాసనం, కేసు తదుపరి విచారణను 26కు వాయిదా వేస్తున్నట్టు తెలియజేసింది.