: ఎన్టీఆర్ ఫొటోకు దండంతో దినచర్య మొదలు!... టీడీపీలో చేరిక సందర్భంగా జ్యోతుల వ్యాఖ్య
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిన్న వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిపోయారు. కుమారుడు, భారీ సంఖ్యలో మద్దతుదారులతో కలిసి విజయవాడ వచ్చిన జ్యోతుల... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడిన జ్యోతుల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఉన్న టీడీపీలోకి చేరడం పుట్టింటికి వచ్చినట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సరైన అవగాహన లేదని ఆయన ఆరోపించారు. అంతా తానేనన్న భావనతో పాటు మిగిలిన వారంతా జీరోలన్న భావన జగన్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. రాష్ట్రాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నుంచి పిలుపు వస్తుంటే... వైసీపీని వీడి టీడీపీలోకి ఎంత తొందరగా రాగలుగుతానా అని ఎదురుచూశానని పేర్కొన్నారు. ఏ పార్టీలో ఉన్నా... దివంగత సీఎం నందమూరి తారకరామారావు ఫొటోకు దండం పెట్టుకున్న తర్వాతే తన దినచర్య మొదలవుతుందని ఆయన ఈ సందర్భగా చెప్పారు.