: 'హెచ్-1బీ' అంటే అంతేమరి... 5 రోజుల్లో 65 వేల వీసాలు హాంఫట్!
హెచ్-1బీ వీసా... అమెరికాలో ఉద్యోగం చేయాలని భావించే విదేశీయులు తీసుకోవాల్సిన అనుమతి. ఈ సంవత్సరం హెచ్-1బీ వీసా నిమిత్తం చెల్లించాల్సిన మొత్తాన్ని 3 రెట్లు పెంచినప్పటికీ, వీసాలకు డిమాండ్ ఎంతమాత్రమూ తగ్గలేదు. గడచిన నాలుగేళ్లలో మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా ఐదంటే ఐదు రోజుల్లో 65 వేల వీసాల కోటా పూర్తయిపోయింది. దీని ద్వారా భారత ఐటీ ఉద్యోగులకు ఎంత డిమాండ్ ఉందో, యూఎస్ లో నిపుణులైన ఐటీ ఉద్యోగుల కొరత ఎలా ఉందో తెలుస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, 2012లో వీసా కోటా పూర్తి కావడానికి 235 రోజులు పట్టగా, ఆపై 2013లో 73 రోజులు పట్టింది. ఆ తరువాత నుంచి రోజుల వ్యవధిలోనే కోటా పూర్తయిపోతూ వస్తోంది. కాగా, మొత్తం ఎన్ని దరఖాస్తులు హెచ్-1బీ వీసా కోసం వచ్చాయన్న విషయాన్ని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ విభాగం తెలియజేయలేదు. గత సంవత్సరం 2.3 లక్షల దరఖాస్తులు రాగా, ఈ సంవత్సరం ఆ సంఖ్యను దాటిపోయి ఉండవచ్చని అంచనా.