: 'ఆది' వైఖరి ‘పైకి ఫ్యాషన్, లోపల ఫ్యాక్షన్’ అంటున్న రామసుబ్బారెడ్డి... హీటెక్కిన జమ్మలమడుగు రాజకీయం!


కడప జిల్లా జమ్మలమడుగులో బద్ధ శత్రువులుగా కొనసాగిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి... ప్రస్తుతం ఒకే పార్టీ నేతలుగా మారారు. రామసుబ్బారెడ్డి ఆది నుంచి టీడీపీ నేతగానే కొనసాగుతుండగా, ఆదినారాయణరెడ్డి ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. టీడీపీలో ఆది చేరిక సందర్భంగా ఇరువురమూ సర్దుకునిపోతామని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు హామీ ఇచ్చారు. అయితే ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు కదా? జమ్మలమడుగులోనూ అదే జరుగుతోంది. ఒకే పార్టీ నేతలుగా ఉంటున్న వారిద్దరి మధ్య పొరపొచ్చాలు మాత్రం దూరం కాలేదు. ఈ మేరకు నిన్న జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆదిపై రామసుబ్బారెడ్డి కీలక ఆరోపణలు చేశారు. పార్టీలో చేరేదాకా బాగానే ఉన్న ఆదినారాయణరెడ్డి... తాజాగా ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని రామసుబ్బారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు తనను, పార్టీ సీనియర్ నేత, ఎంపీ సీఎం రమేశ్ ను ఆహ్వానించరాదని ఆది అనుచరులు బహిరంగంగానే కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎప్పటి నుంచో తమ వెంట, పార్టీని వీడకుండా ఉన్న కార్యకర్తలు ఆది మాటలు వినడం లేదని, దీంతో ఆదినారాయణ రెడ్డి వర్గం బెదిరింపులకు దిగుతోందని ఆయన ఆరోపించారు. ఉగాది వేడుకలకు తమను ఆహ్వానించిన పెద్దదండ్లూరు, సిరిగేపల్లికి చెందిన పార్టీ కార్యకర్తల ఇళ్లపై ఆది వర్గం దాడులకు తెగబడిందన్నారు. పైకి ఫ్యాషన్ అంటూ లోపల ఫ్యాక్షన్ ను ప్రోత్సహిస్తున్న ఆదినారాయణ రెడ్డి తన ద్వంద్వ వైఖరిని మానుకోవాలని రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News