: ‘పుట్టింగల్’ బాధితులకు రక్తమిచ్చేందుకు బారులు తీరిన కర సేవకులు... ఫొటోలు వైరల్


కేరళలోని కొల్లం పరిధిలోని పుట్టింగల్ ఆలయంలో నిన్న తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలుడు కారణంగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 112 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది క్షతగాత్రులను కొల్లం పరిధిలోని పది ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా త్రివేండ్రం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. ఇక బీజేపీ సిద్ధాంతకర్తగా పేరుపడ్డ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చలించిపోయింది. త్రివేండ్రంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు కరసేవకులు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. వందలాది మంది కర సేవకులు క్షణాల్లో ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన రక్తం తామిస్తామంటూ క్యూలో నిలబడ్డారు. రక్త దానం కోసం ఆసుపత్రి ముందు క్యూలో నిలుచున్న కర సేవకుల ఫొటోను ఆరెస్సెస్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. క్షతగాత్రులను ఆదుకునేందుకు మరింత మంది ముందుకురావాలని పిలుపునిచ్చింది. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా వెబ్ సైట్లలోనూ ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Loading...

More Telugu News