: 2017, ఏప్రిల్ 9 నాటి దినపత్రిక ఎలా ఉంటుందంటే..?: బోస్టన్ గ్లోబ్ స్పెషల్ ఎడిషన్!
అదేంటి, వచ్చే సంవత్సరం పేపర్ ఇప్పుడే ఎలా వస్తుంది? అందులో వార్తలు ఎలా ఉంటాయి? అని అనుకుంటున్నారా? అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ, రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్న ట్రంప్ అధ్యక్షుడైతే... ఆనాటి దినపత్రిక ఫ్రంట్ పేజీ ఎలా ఉంటుందో 'ది బోస్టన్ గ్లోబ్' అంచనా వేస్తూ, ప్రత్యేక పేజీని మొదలు పెట్టింది. విదేశాల నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన వారిని వెళ్లగొట్టాలని నిర్ణయించిన ఆయన, తొలి నిర్ణయంగా వలసవాదులను తరిమివేయాలని ఐసీఈ ఫోర్స్ ను రంగంలోకి దించాడన్నది బ్యానర్ న్యూస్. 'తరిమివేత మొదలు' అన్న శీర్షికతో, రెండేళ్లలో 1.3 కోట్ల మందిని దేశం దాటించాలని, ఇందుకు 400 బిలియన్ డాలర్లు మంజూరు చేయాలని యూఎస్ కాంగ్రెస్ ను ఆయన అభ్యర్థించారట. ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే అమెరికా వ్యాప్తంగా గొడవలు, నిరసనలు మొదలయ్యాయని, స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయని వార్తలు ప్రచురించింది. ఆపై ట్రంప్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కుటుంబ సభ్యులను హతమార్చాలని సైన్యాన్ని ఆదేశిస్తే, తాము ఆ పని చేయలేమని వారు వ్యతిరేకించారట. దాదాపు 1400 ఏళ్లుగా సాగుతున్న షియా, సున్నీ ముస్లిం వర్గాలు తమ ప్రయోజనాల కోసం, ట్రంప్ కు వ్యతిరేకంగా ఏకమయ్యారని మరో వ్యంగ్య వార్తను తొలి పేజీలో ఉంచింది.