: జగన్ వయసు నా రాజకీయ అనుభవమంత లేదు: ముద్రగడ
జగన్ వయసు తన రాజకీయ అనుభవమంత లేదని కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. విజయవాడలో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయ పార్టీలకు అమ్ముడుపోలేదని అన్నారు. తన జాతిని ఎవరికీ తాకట్టు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చేసిన దీక్ష తెల్లచొక్కాల కోసం కాదని, పేదలకు గౌరవం కల్పించేందుకేనని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ల వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగానే తప్ప కొత్త డిమాండ్లు ఏమీ చేయలేదని ఆయన అన్నారు. ఆలస్యంగా అయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చంద్రబాబు చెప్పడం ముదావహమని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ చెబితే తానేదో చేస్తానని అనడం అభూతకల్పన అని ఆయన పేర్కొన్నారు.