: భవిష్యత్తులోనూ బీజేపీకి మద్దతు కొనసాగిస్తాం: నితీష్ కుమార్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తుందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ, జేడీ(యు) మధ్య ఇటీవల సంబంధాలు బెడిసికొట్టే పరిస్థతి ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రధాని అభ్యర్ధి ఎవరన్నది తక్షణమే తేల్చాలని కొన్నిరోజుల కిందట బీజేపీపై ఒత్తిడి తెచ్చిన జేడీ(యు) నేతలు ఆ తర్వాత ఏమైందోగానీ ఇప్పుడు కాస్త చల్లబడ్డారు. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన ప్రకటన బీజేపీని కొంత కుదుటపడేలా చేశాయి.
బీహార్ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో మూడు సీట్లకుగాను రెండు స్థానాలకు జేడీ(యు), ఒక స్థానానికి బీజేపీ నామినేషన్లు వేశాయి. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడుతూ.. ఎన్డీఏ సంకీర్ణం బాగానే పని చేస్తుందని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ వారికి మద్దతు కొనసాగిస్తామని చెప్పారు. మంచి సమన్వయం, ఒప్పందంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. కౌన్సిల్ ఎన్నికలకు భాగస్వాముల మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం కూటమిని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.