: జీకే వాసన్ చేరికతో తమిళనాట బలపడిన కెప్టెన్ కూటమి!
త్వరలో ఎన్నికలు జరుగనున్న తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గత నెలలో ప్రజాకూటమితో డీల్ కుదుర్చుకున్న కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు మరింత బలాన్ని చేరుస్తూ, తమిళ మనీల కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత జీకే వాసన్ చేతులు కలిపారు. ఆ వెంటనే తన వాటాలోని 20 నియోజకవర్గాలను టీఎంసీ కోసం ఆయన త్యాగం చేయగా, ప్రజా సంక్షేమ కూటమిలోని ఇతర పార్టీలు మరో 6 స్థానాలను వదులుకున్నాయి. దీంతో పొత్తులో భాగంగా టీఎంసీ 26 స్థానాల్లో పోటీకి దిగనుంది. కెప్టెన్ తో వాసన్ పొత్తుకు వైగో మధ్యవర్తిత్వం వహించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో వాసన్, ముఖ్యమంత్రి జయలలిత వెంట నడుస్తారని ఊహాగానాలు వినిపించినా, సీట్ల పంపిణీ విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో అన్నా డీఎంకేతో కలిసేందుకు వాసన్ ఆసక్తిని చూపలేదు. ఇక తాజా ఎన్నికల్లో కెప్టెన్ కూటమిలోని ఎండీఎంకే 29, టీఎంసీ 26, వీసీకే 25, వామపక్షాలు తలా 25 స్థానాల్లో పోటీ చేయనుండగా, డీఎండీకే 124 స్థానాల నుంచి 104 స్థానాలకు పరిమితం కానుంది.