: ఈ గవర్నర్ వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోంది... వీహెచ్ విమర్శలు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ గవర్నర్ వచ్చిన తరువాత పంతుళ్ల పెత్తనం ఎక్కువైందని మండిపడ్డారు. గవర్నర్ నిత్యం దేవాలయాల చుట్టూ తిరుగుతుండడం వల్ల సామాన్య భక్తులకు ఇబ్బందిగా మారుతోందని ఆయన ఆరోపించారు. సంప్రదాయానికి భిన్నంగా ఉగాది ముందురోజు పంచాగ శ్రవణం వినిపించడమేంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గవర్నర్ పంచాగ శ్రవణం విపించేందుకు వచ్చారా? అని ఆయన అడిగారు. మాట్లాడితే గవర్నర్ తిరుమలకు వెళ్తారని, అక్కడికి వెళితే రాష్ట్రపతి కూడా పధ్ధతిగా ఉంటారని, గవర్నర్ మాత్రం చొక్కావిప్పేసి తిరుగుతారని ఆయన ఆక్షేపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పంచాగ శ్రవణం పరిహాసంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీ కార్యాలయంలో పంచాగ శ్రవణం వినిపిస్తున్నారని, ఆయా పంచాగ శ్రవణ కర్తలు ఆయా కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి అనుగుణంగా పంచాంగం చదువుతున్నారని, ఇలా అయితే పంచాగ శ్రవణంపై నమ్మకం పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.