: 498 చిత్రాల్లో నటించినా లభించని గౌరవం నాకు ఇప్పుడు దొరుకుతోంది: అనుపమ్ ఖేర్
తనకు 498 చిత్రాల్లో నటించినా లభించని గౌరవం ఇప్పుడు లభిస్తోందని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. గత కొన్ని నెలలుగా తాను చేస్తున్న ప్రసంగాల వల్ల ఈ గౌరవం పొందగలుగుతున్నానని చెప్పారు. పూణేలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు 'భారత్ మాతాకీ జై' లాంటి నినాదాలను గర్వంగా చేయాలని అన్నారు. స్వతంత్ర భారతావనిలో ఇటువంటి నినాదాలు చేయడంలో ఎప్పుడూ లేని వివాదం ఇప్పుడెందుకు కొనసాగుతోందని ప్రశ్నించారు. ఇటువంటి నినాదాలు చేస్తుంటే పౌరుడు గర్వంతో ఉప్పొంగిపోతాడని అన్నారు. గుండె లోతుల్లోంచి తాను మాట్లాడే మాటలు తనకు గౌరవం తెచ్చిపెడుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని, అటువంటి వారి మాటలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని అనుపమ్ ఖేర్ అన్నారు. 'భారత్ మాతాకీ జై' నినాదాన్ని వివాదం చేస్తూ టీవీల్లో మాట్లాడుతుంటే వెంటనే టీవీని కట్టిపెట్టేయాలన్నారు. లేదంటే నిజమైన వార్తలను ప్రసారం చేసే దూరదర్శన్ వంటి ఛానల్‌ను చూడాలన్నారు. 60ఏళ్లుగా లేని ఇటువంటి వివాదాలు ఇప్పుడెందుకొస్తున్నాయని ప్రశ్నించారు. ఆ నినాదం చేస్తుంటే తన తనువు గర్వంతో పులకించిపోతుందని అన్నారు.