: ఘనంగా దేవాన్ష్ బర్త్ డే విందు!... సందడి చేసిన బాలయ్య


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ తొలి జన్మదినం (తిథి ప్రకారం) సందర్భంగా నిన్న విజయవాడలో ఏర్పాటు చేసిన విందు అంగరంగ వైభవంగా సాగింది. నగరంలోని ఎన్- కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ విందుకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి సహా పలువురు పార్టీ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చంద్రబాబు కుటుంబంతో పాటు, దేవాన్ష్ మరో తాతయ్య నందమూరి బాలకృష్ణ కూడా సతీసమేతంగా హాజరయ్యారు. విందు జరిగినంత సేపు... ఆ వేడుకకు హాజరైన వారందరిని పేరు పేరునా పలకరిస్తూ బాలయ్య సందడి చేశారు. ఇక విందుకు హాజరైన వారంతా దేవాన్ష్ తో ఫొటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. కేవలం ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే కన్వెన్షన్ సెంటర్ లోకి అనుమతి లభించగా, మిగిలిన వారికి ఆ దరిదాపుల్లోకి కూడా ఎంట్రీ దక్కలేదు. ఇక తన మనవడి పుట్టిన రోజు విందుకు హాజరైన వారందరితో కలిసి చంద్రబాబు, బాలయ్య కుటుంబాలు ఒకేసారి భోజనం చేశాయి. వేద పండితులు ఆశీర్వచనం పలికే సందర్భం మినహా... మిగిలిన సమయమంతా దేవాన్ష్ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు.

  • Loading...

More Telugu News