: అసలీ 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఎవరు?
బాలకృష్ణ 100వ చిత్రంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' పేరిట ఓ సినిమా ఎనౌన్సైన సంగతి తెలిసిందే. ఆయన చరిత్రను ప్రతి తెలుగువాడూ తెలుసుకోవాలని ఈ ఉదయం బాలకృష్ణ వ్యాఖ్యానించారు కూడా. ఈ నేపథ్యంలో అసలీ గౌతమీపుత్ర శాతకర్ణి ఎవరు? చరిత్రలో ఆయన గురించి తెలిసినదేంటి? అన్న వివరాలు సంక్షిప్తంగా. గౌతమీపుత్ర శాతకర్ణి... ఈ రాజుకు ఉన్న మరో పేరు శాలివాహనుడు. క్రీ.శ 78 నుంచి 102 సంవత్సరాల మధ్య దాదాపు భారత ఉపఖండాన్నంతా పాలించిన తెలుగు చక్రవర్తి. శాతవాహన రాజులలో 23వ వాడు. అంతకుముందు క్రీ.పూ 230 ప్రాంతంలో శాతవాహన వంశ స్థాపకుడైన శిముక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లోని కొంత భాగాన్ని జయించి చిన్న రాజ్యం స్థాపించగా, ఆపై ఆయన సోదరుడు కృష్ణ (కన్హ) అటు పడమర, ఇటు దక్షిణాన మరింతగా విస్తరించాడు. ఆపై కృష్ణ వారసుడు మొదటి శాతకర్ణి, శుంగ వంశాన్ని జయించి, అశ్వమేధ యాగం చేయించిన ఘనతను కూడా దక్కించుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కోటలింగాల రాజధానిగా పరిపాలన సాగించాడు. ఆయన కాలంలో ముద్రితమైన నాణాలు ఇప్పటికీ కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి పాలన ప్రారంభమైన తరువాత యవనులు (ఇండో-గ్రీకులు), శకులు (పశ్చిమ క్షాత్రపులు), పల్లవులు (ఇండో-పార్థియన్లు) దేశంపై దండెత్తితే, తన అపార యుద్ధ తంత్రాలు, నైపుణ్యంతో అందరినీ ఓడించాడు. శక చక్రవర్తి విక్రమాదిత్యను ఓడించి సరికొత్త శాలివాహన యుగానికి నాంది పలికాడు. ఆ యుగాన్ని ఇప్పటికీ దక్షిణ భారతీయులు పాటిస్తుండటం గమనార్హం. శాతవాహన రాజులందరిలోనూ శాతకర్ణి గొప్పవాడని పేరు తెచ్చుకున్నాడు. పూర్వీకుల పాలనలో కోల్పోయిన రాజ్యాన్నంతా హస్తగతం చేసుకున్నాడు. ఆయనకు త్రిసముద్రపిత్తోయవాహన (తన అశ్వములతో మూడు సముద్రాలలో నీరు తాగించినవాడు), శకయవనపల్లవనిదూషణ (శకలు, యవనులు మరియు పల్లవుల నాశకుడు) అన్న బిరుదులు పొందాడు. అందుబాటులోని ఆయన చిత్రాలతో కూడిన నాణాలను బట్టి శాతకర్ణి అందగాడని, దృఢముగా ఉంటాడని తెలుస్తోంది. పాలనలో ఉదారత, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని మసలేవాడని పలు శాసనాల్లో ఉంది. ఆయన తల్లి గౌతమీ బాలశ్రీ నాసిక్ ప్రాంతంలో వేయించిన శాసనాలను బట్టి, బ్రాహ్మణ కుటుంబాలను పోషించిన ధార్మికుడని, ధర్మార్థకామ పురుషార్థాలపట్ల శ్రద్ధ చూపేవాడని తెలుస్తోంది. శాతకర్ణి తరువాత ఆయన కుమారుడు వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి క్రీ.శ 102 నుంచి 130 వరకూ పాలన చేపట్టగా, ఈయన పాలనలో శాతవాహనుల ప్రతిష్ఠ మసకబారింది. క్షత్రాప వంశ రాజు తొలి రుద్రవర్మ కూతురిని పెళ్లి చేసుకున్న పులోమావి, సొంత మామతో యుద్ధం చేసి, ఓడిపోయి, శాతవాహన సైన్యానికి తీరని నష్టం చేకూర్చగా, ఆపై వంశమే నెమ్మదిగా కనుమరుగై పోయింది.