: టీడీపీ వైపు కొడాలి నాని చూపు?... హైదరాబాదులో కీలక నేతతో మంతనాలు!


వైసీపీలో కీలక నేతగా ఎదిగి, కృష్ణా జిల్లాలో అధికార టీడీపీకి ఎదురొడ్డి పోరాడుతున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) అలసిపోయారా? అంటే, అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దివంగత ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన కొడాలి నాని... ఎన్డీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ, ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ లకు అత్యంత సన్నిహితుడిగా పేరు పడ్డారు. అటు సినిమాల్లోనే కాక ఇటు రాజకీయ రంగంలోనూ హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లకు తెలియకుండా అడుగు ముందుకేయని కొడాలి నాని... 2014 ఎన్నికలకు ముందు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ వీరాభిమాని ముద్ర, నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ... కొడాలి నానికి విజయాన్ని చేకూర్చిపెట్టాయి. అయితే అనూహ్యంగా వైసీపీ ప్రతిపక్షంలో కూర్చోవడం, గెలవలేదనుకున్న టీడీపీ అధికారం చేపట్టడం జరిగిపోయాయి. ఈ క్రమంలో వైసీపీ నేతగా... టీడీపీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాల్లో ఆ పార్టీకి కొడాలి నాని ఎదురొడ్డి నిలిచారు. సింగిల్ గానే అయినా, ఆయన ఏనాడూ అధికార పక్షానికి దాదాపుగా బెదిరిపోలేదు. అధికార పక్షంపై రాజీలేని పోరు సాగిస్తున్న కొడాలి నాని... మొన్న విజయవాడలో తన గురువు హరికృష్ణతో కలిసి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యారు. కొడాలి నానిని హరికృష్ణ తన కారులో కూర్చోబెట్టుకుని ఆ కార్యక్రమానికి తీసుకెళ్లారు. సదరు కార్యక్రమంలో కొడాలి నానికి బద్ధ శత్రువుగా పరిగణిస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఉన్నారు. అంతా టీడీపీ నేతలు, తానొక్కడే వైసీపీ నేత. అయినా కొడాలి నాని గురువు పక్కనే కూర్చుని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో మాట కలిపారు. ఈ సందర్భంగా కొడాలి నాని తిరిగి తన సొంత గూటికి చేరినట్లేనని నాడు ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను కొట్టేసిన కొడాలి నాని... తన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరిట ఆసుపత్రి నిర్మాణం, దానికి తన గురువు హరికృష్ణ నిధులిచ్చిన కారణంగానే కార్యక్రమానికి వచ్చానని, టీడీపీలోకి చేరే ఉద్దేశమేమీ లేదని ప్రకటించారు. తాజాగా చోటుచేసుకున్న ఓ కీలక ఘటన .. కొడాలి నాని నాడు చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తివేనని తేల్చేస్తున్నాయి. అధికార పార్టీతో పోరులో అలసిపోయిన కొడాలి నాని... తన సొంత గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ మేరకు ఆయన గడచిన రెండు, మూడు రోజుల్లో టీడీపీకి చెందిన ఓ కీలక నేతను హైదరాబాదులో కలిసి తన మనసులోని మాటను బయటపెట్టినట్టు సమాచారం. ఎన్టీఆర్ సొంతూరు గుడివాడలో టీడీపీ జెండా ఎగరాల్సిందేనని బలంగా భావిస్తున్న సదరు కీలక నేత... కొడాలి నాని ప్రతిపాదనకు సానుకూలంగానే స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే కొడాలి నాని నిండు సభ సాక్షిగా... మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులపై చేసిన ఘాటు వ్యాఖ్యలను జీర్ణించుకోలేని టీడీపీ నేతలు మాత్రం నాని ఎంట్రీని అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ సొంత ఊరికి సంబంధించిన వ్యవహారం కావడంతో సదరు నేతలంతా కొడాలి నాని రీఎంట్రీకి తలూపక తప్పదని ఆ కీలక నేత వాదిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే కొడాలి నాని... టీడీపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News