: ఆధ్మాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఉగాది కానుక!... ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియామకం!
ప్రముఖ ఆధ్మాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు... దుర్ముఖి నామ సంవత్సరాది కొత్త బాధ్యతలను కట్టబెట్టింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరైన ఆయనను... ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. సమాజ హితం కోసమే చాగంటిని ప్రభుత్వ సలహాదారుగా ప్రకటిస్తున్నట్లు కూడా చంద్రబాబు పేర్కొన్నారు. వేదిక వద్దకు చేరుకునే క్రమంలో ప్రముఖుల వరుసలో నిలుచుని ఉన్న చాగంటిని పలుకరించిన చంద్రబాబు ఆయనతో చాలాసేపే మాట్లాడారు. ఆ తర్వాత వేదికనెక్కిన చంద్రబాబు ఓ గంట తర్వాత చాగంటిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చాగంటి ప్రాముఖ్యతను చంద్రబాబు కీర్తించారు. చాగంటి ప్రవచనాలు తెలుగు ప్రజలను ముందుకు నడిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను చాగంటి తన ప్రవచనాల ద్వారా కార్యోన్ముఖులను చేస్తున్నారన్నారు. చాగంటి ప్రవచనాలు చాలా బాగున్నాయని. చాగంటి ప్రవచనాలు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చంద్రబాబు కీర్తించారు.