: నాకెవరూ పోటీ లేరు... నా సినిమాలే నాకు పోటీ!: అమరావతిలో బాలయ్య
టాలీవుడ్ అగ్ర హీరో, అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రానికి శ్రీకారం చుట్టారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఉద్వేగపూరిత ప్రసంగం చేసిన బాలయ్య... తన వందో చిత్రం శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తనదైన స్టైల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తనకెవరూ పోటీ లేరని, తన సినిమాలే తనకు పోటీ అని ఆయన పేర్కొన్నారు. రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలుకొట్టాలన్నా తమకే సాధ్యమని కూడా ఆయన ప్రకటించారు. 99 సినిమాల కృషి ఫలితమే వందో సినిమా అని అన్నారు. తన వందో చిత్రంపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలు నెరవేరేలా పనిచేస్తానని బాలయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బాలయ్య ప్రస్తావించారు. దేశం మొత్తాన్ని ఏకచ్ఛాత్రాదిపత్యంగా ఏలిన చక్రవర్తిగా శాతకర్ణిని ఆయన అభివర్ణించారు. శాతకర్ణి యుద్ధాలు చేసింది శాంతిస్థాపన కోసమేనన్నారు. శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తన తండ్రి దివంగత నందమూరి తారకరామారావు సినిమా తీయాలనుకున్నారని, కానీ కొన్ని కారణాలతో తీయలేకపోయారన్నారు. అంతకుముందు విజయవాడలోని గౌతమీపుత్ర శాతకర్ణి విగ్రహానికి నివాళులర్పించిన బాలయ్య నేరుగా వేదిక వద్దకు చేరుకున్నారు.