: భానుడి ప్రతాపానికి ఏపీలో 45మంది మృతి: చినరాజప్ప వెల్లడి
తీవ్రరూపం దాల్చుతోన్న ఎండలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రతకు వడదెబ్బతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వేసవిలో ఏప్రిల్ మొదటి వారం నాటికే వడదెబ్బ కారణంగా 45 మంది మరణించారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఎండతీవ్రతను తట్టుకోవడానికి ప్రజలు నిపుణుల సూచనలు పాటించాలని, వైద్యాధికారులు వేగంగా స్పందిస్తూ ఉండాలని సూచించారు. ఇక వడదెబ్బ ధాటికి మరణాల సంఖ్య జిల్లాల వారీగా చూస్తే.. కడప జిల్లాలో అత్యధికంగా 16 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరు, కృష్ణాజిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో పదకొండు మంది, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో నలుగురు మరణించారని ఆయన చెప్పారు. మరో వైపు తెలంగాణలో ఇప్పటి వరకు 66 మంది మృతి చెందినట్లు తెలంగాణ ప్రభుత్వం నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే.