: పాఠశాలల మధ్య పోటీ... కాసుల కోసం కక్కుర్తి!
విద్యాబుద్ధులు నేర్పి, తప్పు చేస్తే మందలించాల్సిన గురువు, స్కూళ్ల మధ్యనున్న అనారోగ్యకరమైన పోటీతో మరో స్కూల్ పరువు బజారుకీడుద్దామని తప్పుచేస్తే...ఆ తప్పును తమకు కాసులు కురిపించేలా మార్చుకుందామని మీడియా ప్రతినిధులు మరింత దిగజారారు. దీంతో గురువులు, మీడియాపై తీవ్రవిమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే...హైదరాబాదులోని ఓ ప్రైవేటు పాఠశాల టెర్రస్ పై 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అత్యంత సన్నిహితంగా ఉండగా, వారిని మరో ప్రైవేటు పాఠశాలకు చెందిన మహిళా టీచర్ వీడియో తీశారు. దానిని ఆమె తమ ప్రిన్సిపల్ కు చూపించడం జరిగింది. దీంతో, తమకు పోటీగా ఉన్న స్కూల్ కు చెడ్డపేరు తీసుకురావాలన్న లక్ష్యంతో ఆ వీడియోను కొందరికి వాట్స్ యాప్ లో ఆ ప్రిన్సిపల్ షేర్ చేశారు. ఇది విపరీతంగా సర్క్యులేట్ అయి కొందరు మీడియా ప్రతినిధుల ఫోన్లలోకి వెళ్లింది. దీంతో వాళ్లు విద్యార్థులు గల సదరు స్కూల్ యాజమాన్యాన్ని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసేందుకు పావులు కదిపారు. ఈ వీడియో గురించి బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు హైదరాబాదులోని బాలానగర్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికతో సన్నిహితంగా మెలగిన బాలుడు, దీనిని వీడియో తీసిన మహిళా టీచర్, సదరు స్కూలు ప్రిన్నిపల్ పై కేసు నమోదు చేశారు. అలాగే బ్లాక్ మెయిల్ చేసిన మీడియా రిపోర్టర్లపై దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. దీంతో దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.