: పాక్ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి వినోద్ కాంబ్లీ ఆసక్తి! ... తాను సిద్ధమేనంటూ పాక్ జర్నలిస్ట్ కు మెసేజ్


ఆసియా కప్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఘోర పరాజయం తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై పెను విమర్శలు వెల్లువెత్తాయి. టీ20 జట్టు కెప్టెన్ గా షాహిద్ ఆప్రీది రాజీనామా చేస్తే... అప్పటిదాకా జట్టుకు చీఫ్ కోచ్ గా వ్యవహరించిన వకార్ యూనిస్ కూడా తప్పుకున్నాడు. తదనంతర పరిణామాల్లో ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ గా సర్ఫరాజ్ అహ్మద్ ఎంపిక కాగా, కోచ్ పదవిని చేపట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో తమ జట్టుకు చీఫ్ కోచ్ కోసం పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటనకు ఇతర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఏ మేరకు స్పందించారో తెలియదు కాని... అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మాత్రం అమితాసక్తి చూపాడు. ఈ మేరకు కాంబ్లీ పాకిస్థాన్ కు చెందిన మహిళా జర్నలిస్టు అస్మా సిరాజీకి ట్విట్టర్ లో తన ఆసక్తిని తెలుపుతూ మెసేజ్ లు పంపాడు. పాక్ క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్ గా పనిచేసేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని అతడు ఆ సందేశంలో తెలిపాడు. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రమాదకర పరిస్థితుల్లో కోచ్ గా ఎలా రాణించగలుగుతారంటూ అస్మా వేసిన ప్రశ్నలకు కాంబ్లీ మరింత ఆసక్తికర సమాధానాన్ని పోస్ట్ చేశాడు. ఐపీఎల్ లో పాక్ కు చెందిన వసీం అక్రం భారత్ లోని ఓ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నారుగా, తాను ఎందుకు పాక్ కోచ్ పదవి చేపట్టలేనని అతడు ఎదురు ప్రశ్న వేశాడు. కాంబ్లీ ఆసక్తి ఎలా ఉన్నా... కోచ్ గా పెద్దగా అనుభవమేమీ లేని కాంబ్లీ పట్ల పీసీబీ ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News