: ఎన్ఐఏ అధికారి హత్య వెనుక దగ్గరి బంధువుల కుట్ర... తొలి అరెస్ట్!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ఆఫీసర్, పఠాన్ కోట్ ఉగ్రదాడుల దర్యాఫ్తు బృందంలో ఒకరైన అధికారి మహమ్మద్ తాంజిల్ అహ్మద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆయన హత్య వెనుక బంధువుల కుట్ర దాగుందని కనుగొన్న ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. యూపీ పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఆయన దగ్గరి బంధువే, ఓ కాంట్రాక్టు కిల్లర్ సహాయంతో ఈ హత్య చేయించినట్టు తెలుస్తోంది. ఆస్తి తగాదాలే హత్యకు ప్రధాన కారణమని భావిస్తున్నామని, ఓ డీల్ లో భాగంగా కమిషన్ ఇస్తానని చెప్పిన అహ్మద్, దాన్ని ఇవ్వకపోవడంతోనే హత్యకు ప్రణాళిక జరిగిందని సమాచారం. కాగా, అహ్మద్ హత్య కేసును ఛేదించేందుకు ఏటీఎస్, ఎస్టీఎఫ్ విభాగాలను ఏర్పాటు చేసిన యూపీ అదనపు డీజీ దల్జీత్ చౌదరి ఈ కేసులో చిక్కుముడులన్నీ అతి త్వరలో విప్పి నిందితులను చట్టానికి అప్పగిస్తామని తెలిపారు.