: వెంకన్నకు కేసీఆర్ మొక్కుల ఆభరణాలు సిద్ధం!... నెలాఖరులో తిరుమలకు కేసీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే... తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి రూ.5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను అందజేస్తానని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో మొక్కుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అందుకోసం అలుపెరగని ఉద్యమం సాగించిన కేసీఆర్... తెలంగాణ సీఎం పీఠంపై ఆసీనులయ్యారు. ఈ క్రమంలో మొక్కుల జాబితాను బయటకు తీసిన కేసీఆర్... ఇప్పటికే పలు మొక్కులను తీర్చేసుకున్నారు. ఇందులో భాగంగా తిరుమల వెంకన్నకు ప్రమాణం చేసిన మొక్కును తీర్చుకునేందుకు కూడా కేసీఆర్ ఇదివరకే చర్యలు చేపట్టారు. తెలంగాణ సర్కారు నిధి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఖజానాకు రూ.5 కోట్లను ఇదివరకే అందజేశారు. వెంకన్నకు తాను ఇవ్వాలని మొక్కుకున్న సాలిగ్రామ హారం, కంఠాభరణాలను తయారుచేయించాలని ఆ సందర్భంగా ఆయన టీటీడీని కోరారు. కేసీఆర్ అభ్యర్థన మేరకు టీటీడీ... సదరు ఆభరణాల తయారీ కోసం టెండర్లను పిలిచింది. మూడు సంస్థలు ఆ టెండర్లను దక్కించుకునేందుకు బిడ్లు దాఖలు చేయగా... కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ ‘కీర్తిలాల్ కాళిదాస్ జ్యువెలర్స్’ టెండర్ ను దక్కించుకుంది. 22 కేరట్ల మేలిమి బంగారంతో గ్రాము ఒక్కింటికి రూ.2,611 చొప్పున సదరు సంస్థ...14.9 కిలోల సాలిగ్రామ హారాన్ని రూ.3.7 కోట్లతో, 4.650 కిలోల ఐదు పేటల కంఠాభరణాన్ని రూ.1.21 కోట్లతో తయారు చేసింది. తయారీ పూర్తి అయిన నేపథ్యంలో ఇప్పటికే ఆ సంస్థ సదరు ఆభరణాలను టీటీడీ ఆభరణాల ఖజానాకు అందజేసింది. ఆభరణాలు అందిన విషయాన్ని కేసీఆర్ కు తెలియజేసిన టీటీడీ, తిరుమల వచ్చి స్వయంగా స్వామివారికి వాటిని బహూకరించాలని కోరింది. టీటీడీ సమాచారం నేపథ్యంలో కేసీఆర్ ఈ నెలాఖరున తిరుమల వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇప్పటికే కేసీఆర్ తిరుమల పర్యటన ఖరారైనా తేదీలు మాత్రం వెల్లడి కాలేదు.