: గుడివాడలో మహా మాయగాళ్లు!... సర్కారీ భూమిని తనఖా పెట్టి రూ.32 కోట్ల రుణం
కృష్ణా జిల్లా గుడివాడలో మహా మోసం వెలుగుచూసింది. సర్కారీ భూమిని తనఖా పెట్టేసిన మాయగాళ్లు ఓ బ్యాంకును బురిడీ కొట్టించి ఏకంగా రూ.32 కోట్ల రుణాన్ని పొందారు. ఆ తర్వాత తమకేమీ తెలియనట్లు వ్యవహరించారు. సర్కారీ భూమిని తనఖా పెట్టిన సందర్భంలో ఆ భూమిని రైతులదిగా పేర్కొన్న ఆ మాయగాళ్లు చేసిన నయా మోసంతో ప్రస్తుతం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సీబీఐ అధికారులు ఆదాయపన్ను అధికారిని లంచం ఆరోపణలపై అరెస్ట్ చేసిన సందర్భంగా ఈ ఘరానా మోసం బయటపడింది. వివరాల్లోకెళితే... గుడివాడలోని ఓ సొసైటీకి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని ఆసరా చేసుకుని నిమ్మగడ్డ రామకృష్ణ అనే వ్యక్తి మోసానికి తెర తీశాడు. సదరు భూమిని పలువురు రైతులకు చెందినదిగా నకిలీ పత్రాలు సృష్టించి ఆంధ్రా బ్యాంకును సంప్రదించాడు. రామకృష్ణ మాయ మాటలకు పడిపోయిన బ్యాంకు అధికారులు సదరు పత్రాలను సరిచూసుకోకుండానే ఆ పత్రాలను తనఖా పెట్టుకుని అతగాడికి రూ.32 కోట్లను అప్పుగా ఇచ్చేశారు. ఇచ్చిన రుణం ఎంతకీ వసూలు కాకపోవడంతో భూమి హక్కుదారులుగా రామకృష్ణ పేర్కొన్న రైతులకు నోటీసులు జారీ చేశారు. సదరు రైతులు తహశీల్దార్ ను సంప్రదించగా, ఆయన ఈ నోటీసులను పరిశీలించి, చీటింగ్ జరిగిందని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో తహశీల్దార్ సీబీఐ అధికారులకు సమాచారం చేరవేయడంతో, రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు రామకృష్ణను అరెస్ట్ చేశారు.