: పార్టీలో చేరికకు ముందే టీడీపీ సర్కారులో క్రియాశీలకంగా జ్యోతుల!
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై బరిలోకి దిగిన జ్యోతుల నెహ్రూ విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయాల్లో తన సీనియారిటీ ఆధారంగా అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పదవి పొందారు. అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి నచ్చని కారణంగా ఆయన వైసీఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేశారు. తాను గతంలో కొనసాగిన టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 11న ముహూర్తం నిర్ణయించుకున్న ఆయన తన తోడల్లుడు, మరో వైసీపీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుతో కలిసి టీడీపీలోకి వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీలో చేరడం ఖాయమే అయినప్పటికీ... ఇంకా పార్టీలో చేరలేదు. అయినా నిన్న ఆయన విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. కాపు కార్పొరేషన్ పై సమీక్ష కోసం సీఎం నారా చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు అప్పటికే అక్కడకు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మరికాసేపట్లో సమీక్ష ప్రారంభమవుతుందనగా జ్యోతుల నెహ్రూ అక్కడికి వచ్చారు. అందరితో పాటే జ్యోతుల కూడా సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. గంటల తరబడి జరిగిన సమీక్ష ఆసాంతం జ్యోతుల అక్కడే ఉన్నారు. సమావేశంలో కీలక భూమిక పోషించినట్లు కూడా సమాచారం. ఇక సమావేశం తర్వాత చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ అయిన జ్యోతుల... దాదాపు గంటకు పైగా పలు విషయాలపై చంద్రబాబుతో చర్చలు జరిపారు. పార్టీలో చేరకుండానే జ్యోతుల క్రియాశీలకంగా మారడం అక్కడ చర్చనీయాంశంగా మారింది.