: సీఎం చంద్రబాబు చాలా తెలివైనవారు...లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడంలో తప్పులేదు: ఎంపీ జేసీ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా తెలివైనవారని, లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమర్థత నిరూపించుకుంటే లోకేష్ మంత్రి పదవిలో కొనసాగుతారని కూడా ఆయన అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ గురించి ఆయన ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ అనే డ్యాంకు గండిపడిందని, ఇక నీళ్లు నిలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఒక వెల్లువలా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరతారని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత తన తండ్రి గురించి చెప్పడం కాదని, తానేంటో నిరూపించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా ఆయన విమర్శించారు. రాజీవ్, సోనియాల కుమారుడు కనుకే రాహుల్ గాంధీకి పార్టీలో ఉన్నత పదవులు దక్కాయన్నారు. నియోజకవర్గాల పెంపు విషయమై మాట్లాడుతూ, అందుకోసం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు యత్నిస్తున్నారన్నారు.