: హెచ్ సీయూ గేట్లెక్కిన విద్యార్థులు... అరెస్ట్ చేసిన పోలీసులు
రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో రణరంగంగా మారిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నేటి ఉదయం మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ పొదిలె అప్పారావు సుదీర్ఘ సెలవును ముగించుకుని ఇటీవలే తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో వీసీ బంగ్లాపై దాడికి దిగిన విద్యార్థులు అప్పారావును వీసీగా అంగీకరించేది లేదని నిరసన గళం విప్పారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్లను ఓ దరికి చేర్చి విద్యార్థుల ఆందోళనలకు తెరదించేందుకు అప్పారావు నేటి ఉదయం అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి నిరసనగా విద్యార్థుల ఐక్యకార్యాచరణ కమిటీ(జేఏసీ) చలో హెచ్ సీయూకు పిలుపునిచ్చింది. ఈ నిరసన ప్రదర్శనకు పది వామక్షాలు కూడా మద్దతు పలికాయి. ఈ క్రమంలో ఓ వైపు వీసీ అప్పారావు వర్సిటీలోపల అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు. అదే సమయంలో వర్సిటీ ప్రధాన గేటు వద్దకు చేరుకున్న విద్యార్థులు నినాదాల హోరును వినిపించారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు వర్సీటీ గేట్లను మూసివేసి విద్యార్థులను అడ్డుకున్నారు. పోలీసుల నిర్బంధాన్ని విడిపించుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులు వర్సిటీ గేట్లను ఎక్కారు. దీంతో విద్యార్థులను కిందకు ఈడ్చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.