: ఆరని టీమిండియా ఓటమి సెగ... రణరంగంగా శ్రీనగర్ నిట్, చిక్కుల్లో తెలుగు విద్యార్థులు
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో టీమిండియా పరాజయం నేపథ్యంలో శ్రీనగర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో చోటుచేసుకున్న అల్లర్లు మరింత విషమించాయి. తొలుత చిన్న వివాదంగా మొదలైన గొడవలు... తాజాగా లోకల్, నాన్ లోకల్ విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీశాయి. ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గొడవలపై సమాచారం అందుకున్న ప్రభుత్వం సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. వర్సిటీలోకి రంగప్రవేశం చేసిన వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు కనిపించిన విద్యార్థులపై లాఠీలు ఝుళిపించాయి. ఇదిలా ఉంటే, విద్యాలయంలో చోటుచేసుకున్న గొడవల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు యత్నిస్తున్న విద్యార్థులను పోలీసులు అనుమతించడం లేదు. ఇంటికెళతామన్నా పంపించని పోలీసులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా గొడవల కారణంగా అక్కడే చిక్కుకుపోయిన పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. వీరిలోనూ పలువురు విద్యార్థులు గాయపడ్డట్లు సమాచారం.