: 'పనామా దెబ్బ'కు పడిన తొలి వికెట్... ఐస్ ల్యాండ్ ప్రధాని రాజీనామా
విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలు 'పనామా పేపర్స్' పేరిట విడుదలైన తరువాత ఏర్పడిన ప్రకంపనలు ఐస్ ల్యాండ్ ప్రధానిపై ప్రభావం చూపాయి. ఈ జాబితా విడుదలైన తరువాత పదవికి దూరమైన తొలి వ్యక్తిగా ఐస్ ల్యాండ్ ప్రధాని సిగ్ముందర్ డేవిడ్ గునాల్గుసన్ నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మీడియా ప్రతినిధుల భాగస్వామ్యంలో మొత్తం 1.15 కోట్ల పత్రాలను పరిశీలించిన తరువాత, రెండు విడతలుగా నల్లధనం దాచుకున్న వారి పేర్లు బయటకు వెల్లడైన సంగతి, ఈ జాబితాలో 140 మంది రాజకీయ నేతలున్న సంగతి తెలిసిందే. "పార్టీ పార్లమెంటరీ సమావేశంలో, తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. తదుపరి నేను బాధ్యతలు స్వీకరిస్తా" అని పార్టీ ఉప నేత సిగూర్దర్ ఇంగి జాన్సన్ ప్రకటించారు. అంతకుముందు ఐస్ ల్యాండ్ లో హైడ్రామా నడిచింది. తనకు మద్దతివ్వకుంటే పార్టీని రద్దు చేస్తానని ప్రధాని సిగ్ముందర్ ప్రకటించారు. ఆపై పార్లమెంట్ సభ్యుల నుంచి వచ్చిన నిరసనలతో రాజీనామాకు అంగీకరించినట్టు తెలుస్తోంది. 2008 ఆర్థిక మాంద్యంలో ఐస్ ల్యాండ్ బ్యాంకులు కుప్పకూలిన సమయంలో, సిగ్ముందర్, ఆయన భార్య విదేశాల్లో మిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్టు పనామా పత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే.