: విశ్వనాథన్ ఆనంద్ కు మరో పురస్కారం
ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. దేశంలో వివిధ రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన, విజయవంతమైన వ్యక్తులను హృదయనాథ్ పురస్కారంతో గౌరవిస్తారు. ఈ పురస్కారానికి ఎంపికైన విశ్వనాథన్ ఆనంద్ కు రూ.2 లక్షల నగదు, ఒక జ్ఞాపిక ను అందజేయనున్నారు. ఈ నెల 12వ తేదీన మహారాష్ట్రలో జరిగే కార్యక్రమంలో గవర్నర్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును అందుకున్న వారిలో లతా మంగేష్కర్, బాబా సాహెబ్ పురందరె, ఆశా భోంస్లే, అమితాబ్ బచ్చన్, హరిప్రసాద్ చౌరాసియా, ఏఆర్ రెహ్మాన్ తదితర ప్రముఖులు ఉన్నారు. కాగా, నలభై ఆరు సంవత్సరాల ఆనంద్ 1988లో భారత తొలి గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. 2000-2002 వరకు ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ సాధించిన ఆనంద్ 2007లో ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగాడు.