: ప్రత్యూష, రాహుల్ సమస్యలను పరిష్కరించేందుకు సాయపడ్డా: 'చిన్నారి పెళ్లికూతురు' తల్లి
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌లో 'ఆనంది'గా నటించిన ప్రత్యూష బెనర్జీ(24) ఆత్మహత్యపై ఆమె తల్లి స్పందించింది. ప్రత్యూష, ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్సింగ్ ఇద్దరూ నిత్యం గొడవపడేవారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు సాయపడ్డానని ప్రత్యూష తల్లి సోమా తెలిపారు. ముంబై బంగుర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని చెప్పారు. ప్రత్యూషకు, రాహుల్కు విభేదాలు వచ్చాక ఇద్దరూ విడిపోయారని ఆమె అన్నారు. గొడవపడటం మానుకుని కెరీర్పై దృష్టిసారించాలని వారిద్దరికీ తాను సలహా ఇచ్చినట్లు సోమా పోలీసులకు చెప్పారు. ప్రత్యూష ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తనకు తెలియదని, ఈ కేసును సమగ్రంగా విచారించాలని పోలీసులను కోరారు. ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేమే కారణమని భావిస్తున్నారు. అయితే, ఆమె ప్రియుడు రాహుల్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. రాహుల్ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో రాహుల్ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.