: హవాలా సొమ్మును దేశ సరిహద్దులు దాటించే మొసాక్ ఫోన్సెకా!


మొసాక్ ఫోన్సెకా... హవాలా సొమ్మును గుట్టు చప్పుడు కాకుండా దేశాల సరిహద్దులు దాటిస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ పేరిది. ఈ సంస్థ నుంచి లీకైన రహస్య పత్రాలు పనామా పేపర్స్ లో బహిర్గతమవడంతో ఈ సంస్థ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇంతకీ, ఈ సంస్థను ఎవరు స్థాపించారు?, అది చేసే పనులు? మొదలైన విషయాల గురించి ఆరా తీస్తే... రామన్ ఫోన్సెకా, జుర్గెన్ మొసాక్ లిద్దరికీ వేర్వేరుగా ఉన్న 'లా' (న్యాయ సంబంధమైన) సంస్థలను విలీనం చేసి 1986లో మొసాకా ఫోన్సెకా సంస్థను ఏర్పాటు చేశారు. ఫోన్సెకా స్వస్థలం పనామా కాగా, జర్మన్ జాతీయుడైన మొసాక్ పనామాలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పనామా అధ్యక్షుడికి సలహాదారుడిగా పనిచేసిన ఫోన్సెకాకు ప్రపంచ రాజకీయాల గురించి తెలుసు. అంతేకాదు, ఆయన రచయిత కూడా. మొసాక్ విషయానికొస్తే, పనామా విదేశీ సంబంధాల కౌన్సిల్ లో పని చేశాడు. పనామాలో బోగస్ కంపెనీలు... ప్రముఖుల, ప్రభుత్వాధినేతల నల్లధనాన్ని గుట్టు చప్పుడు కాకుండా దేశ సరిహద్దులు దాటించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఇందుకుగాను పనామాలో పలు బోగస్ కంపెనీలను సృష్టించి, వాటిల్లోకి ఈ నల్ల డబ్బును మళ్లిస్తుంది. అందుకుగాను, నల్లకుబేరుల నుంచి పెద్ద మొత్తంలో షేర్లు తీసుకుంటుందని ఆరోపణలు ఉన్నాయి. న్యాయసంబంధమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు న్యాయవాదులను సైతం ఈ సంస్థ నియమించుకుంటుంది. అర్జెంటీనా మాజీ అధ్యక్షుడి నల్ల ధనాన్ని దారి మళ్లించింది ఈ సంస్థేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగాను అమెరికాలోని నెవాడా స్టేట్ లో సుమారు 123 బోగస్ కంపెనీలను సృష్టించిందని ఆరోపణలు. నల్ల కుబేరుల సొమ్మును అవలీలగా దేశాల సరిహద్దులు దాటించడం, ఆ సొమ్ముకు రక్షణగా ఉండటంలో మొసాక్ ఫోన్సెకా సంస్థ చాలా కీలకపాత్ర పోషిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News