: మోహరించిన గుంటూరు, ప్రకాశం పోలీసులు... చంద్రబాబు వద్దకు నీటి పంచాయతీ
కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య నెలకొన్న నీటి వివాదం ముఖ్యమంత్రి వద్దకు చేరింది. తమకు అత్యవసరంగా నీరు కావాలని గుంటూరు జిల్లా ప్రజలు, పలువురు ప్రజా ప్రతినిధులు సాగర్ కెనాల్ లాకులను తీసేందుకు యత్నించిన నేపథ్యంలో, అలా చేస్తే తమకు రావాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా రాదని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమతో ఫోన్లో మాట్లాడారు. లాకులు తీసివేస్తే ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను చంద్రబాబుతో చర్చించి, ఓ నిర్ణయానికి వస్తానని చెప్పిన దేవినేని, ముఖ్యమంత్రికి పరిస్థితి తీవ్రత గురించి చెప్పినట్టు తెలుస్తోంది. ఆపై దేవినేని మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు సంయమనం పాటించాలని, నీటి అవసరాలను తీర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వివరించారు. కాగా, లాకుల వద్ద ఓవైపు గుంటూరు, మరోవైపు ప్రకాశం జిల్లా పోలీసులు మోహరించారు. లాకులు తీసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని ప్రకాశం జిల్లా పోలీసులు హెచ్చరించడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉన్నట్టు సమాచారం.