: గుంటూరు, ప్రకాశం ప్రజల మధ్య నీటి యుద్ధం... ప్రజా ప్రతినిధుల రాకతో ఉద్రిక్తత!
నాగార్జున సాగర్ నీటి విషయమై గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య నెలకొన్న వివాదం నేడు మరింత పెద్దదైంది. సాగర్ కుడి కాలువ 85/3 వద్ద ఉన్న గేట్లను ఎత్తివేసేందుకు గుంటూరు జిల్లా ప్రజలు పెద్దఎత్తున చేరుకోవడంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తింది. నిబంధనల ప్రకారం, నీరు ప్రకాశం జిల్లాకు వెళుతుండగా, తాము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామంటూ గుంటూరు జిల్లా వాసులు గేట్లను ఎత్తివేసేందుకు వచ్చారు. ప్రధాన గేటు వద్దకు ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం రావడంతో అక్కడి అధికారులకు ఏం చెప్పాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఈ గేట్లను ఎత్తివేస్తే, చుక్క నీరు కూడా దక్కదని ఆందోళన చెందుతున్న ప్రకాశం అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కాగా, సాగర్ నుంచి 83 మైళ్ల పరిధిలోని రైట్ కెనాల్ నీరు గుంటూరు జిల్లా అవసరాలకు ఉపయోగపడుతుండగా, అక్కడి నుంచి 126 మైళ్ల వరకూ ప్రకాశం అవసరాలను తీరుస్తోంది. ప్రధాన కాలువకు అనుబంధంగా, పిల్ల కాలువలు 5,342 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. మొత్తం 11.17 లక్షల ఎకరాల భూమి ఆయకట్టుగా ఉండగా, ప్రకాశంలో 4.42 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఇక 85/3 లాకుల వద్ద కెనాల్ రెండుగా విడిపోతుంది. ప్రధాన లాకులు మూసివుంటేనే నీరు ప్రకాశం జిల్లాకు చేరుతుంది. ఇక్కడ లాకులను తెరిస్తే, నీరు గుంటూరు వైపున్న కాలువకు మరలి ప్రకాశంకు నీరు అందదు. పరిస్థితి విషమించేలోపే అధికారులు కల్పించుకోవాలని ప్రకాశం జిల్లా ఇరిగేషన్ సర్కిల్ అధికారులు కోరుతున్నారు.