: ఇండియాలో టాప్ ఐఐటీ, ఐఐఎంల జాబితా ఇదే: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ


ఇండియాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఐఐటీల ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ విభాగంలో అత్యుత్తమ కాలేజీగా ఐఐటీ మద్రాస్ నిలువగా, రెండవ స్థానంలో ఐఐటీ బాంబే, మూడవ స్థానంలో ఐఐటీ ఖరగ్ పూర్ లు నిలిచాయి. దేశంలోని ఐఐటీలు, ఐఐఎంలలో ఉత్తమమైన వాటికి ర్యాంకులను ఇస్తూ, కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ఓ జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం, మేనేజ్ మెంట్ విభాగంలో ఐఐఎం బెంగళూరు, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక యూనివర్శిటీల విషయానికి వస్తే, ఐఐఎస్సీ బెంగళూరు తొలి స్థానంలో నిలువగా, ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ రెండవ స్థానంలో నిలిచింది. ఇటీవలి కాలంలో జాతి వ్యతిరేక నినాదాలు, ఉరి తీయబడ్డ ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూల సభలు నిర్వహించి వార్తల్లోకి ఎక్కిన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ మూడవ స్థానంలో నిలవడం గమనార్హం. ఫార్మసీ విభాగంలో మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్యాస్యుటికల్ సైన్సెస్, చండీగఢ్ లోని యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా సైన్సెస్, జామియా హమ్ దర్ద్, న్యూఢిల్లీలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం ఆరు విభాగాల్లో 3,500 ఇనిస్టిట్యూషన్స్ ను పరిశీలించి ఈ జాబితాను తయారు చేశామని ఈ సందర్భంగా స్మృతీ ఇరానీ తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్ 29న నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)ను ప్రవేశపెట్టిన తరువాత విడుదలైన తొలి ర్యాంకులు ఇవని వెల్లడించారు.

  • Loading...

More Telugu News