: బీడీల తయారీపై అంచెలవారీ నిషేధం.. మరి వారి జీవనాధారం?
పొగాకు ఉత్పత్తులపై అంచెలవారీ నిషేధానికి ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. ఫలితంగా బీడీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీడీలు తయారు చేసే కార్మికులు తమ పొట్టగొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. ప్రజారోగ్యం దృష్ట్యా పొగాకు నిషేధం తప్పని పరిస్థితి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమగా బీడీ పరిశ్రమ ఉంది. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు బీడీ పరిశ్రమే జీవనాధారం. పలు కుటుంబాలు ప్రధానంగా ఈ పరిశ్రమపైనే ఆధారపడుతున్నాయి. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బీడీ ఆకుల సేకరణపై ఉపాధి పొందుతున్న లక్షలాదిమంది ఆదాయానికి ఈ నిర్ణయం పెద్ద దెబ్బే. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో ప్రతి ఇంటిలో ఒకరిద్దరు బీడీలు చుడుతున్నారు. రాష్ట్రంలో 7లక్షల మంది బీడీలు చేస్తుండగా.. రోజుకు 40-45కోట్ల బీడీలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాదు.. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో బీడీ ఆకుల సేకరణ అక్కడి గిరిజనులకు ప్రధాన ఉపాధి వనరుగా ఉంది. దీనిపై ఆధారపడి దేశవ్యాప్తంగా సుమారు 3.10కోట్లమంది జీవిస్తున్నారు. అలాగే సిగరెట్ పరిశ్రమలు, వ్యాపారాలపై దేశంలో మరో 70లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం పొగాకుపై నిషేధ ఆదేశాల నేపథ్యంలో దేశంలో తమ పరిశ్రమల్ని మూసేసేందుకు పలు సిగరెట్ల ఉత్పాదక సంస్థలు ప్రయత్నాలు మొదలెట్టాయి. అయితే, మరోవైపు ధూమపాన సంబంధిత రోగాల వల్ల ప్రజలపై ఏటా ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయల భారం పడుతోంది. ఏటా పది లక్షల మంది ఈ రోగాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలను ఈ రోగాల బారి నుంచి కాపాడి వారి ఆరోగ్యానికి రక్షణ కల్పించడమే కాకుండా వారి శక్తి యుక్తులు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉపయోగపడేలా చేయాలంటే ధూమపానం ముప్పును తెలియచేస్తూ సిగరెట్ ప్యాకెట్లు, బీడీ కట్టలపై ముద్రించే హెచ్చరికల పరిమాణం పెంచాలని సూచించింది. పొగాకు ఉత్పత్తుల వినియోగం ద్వారా ఏటా లక్షల మంది వ్యాధుల బారిన పడుతున్నారని, ఆ వ్యాధుల నివారణ కోసం భారత దేశంపై రూ.1,04,500 కోట్ల ఆర్థిక భారం పడుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఆర్థిక భారాన్ని, పొగాకు వినియోగాన్ని నియంత్రించేందుకు సంబంధిత ఉత్పత్తులపై భారీ సైజులో హెచ్చరికలను ముద్రించాల్సిన అవసరం ఉందని సూచించింది. ప్రధానంగా బీడీలు, సిగరెట్లు, ఇతర ఉత్పత్తుల వలన కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పొగాకు వినియోగం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.