: అతిపెద్ద లీక్... పుతిన్, నవాజ్ షరీఫ్, మెస్సీ... నల్లడబ్బు వివరాలు బట్టబయలు
ప్రపంచ దేశాల్లో సంచలనం... ఎంతోమంది ప్రస్తుత, మాజీ దేశాధ్యక్షులతో పాటు ప్రముఖ ఆటగాళ్లు దాచుకున్న నల్లధనం వివరాలను జర్మనీ పత్రిక ఒకటి వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లీక్ గా భావిస్తున్న ఈ సమాచారాన్ని దాదాపు 1.15 కోట్ల పత్రాలను పరిశీలించి క్రోడీకరించినట్టు తెలుస్తోంది. 1975 నుంచి డిసెంబర్ 2015 వరకూ, దాదాపు 2.14 లక్షల సంస్థలకు చెందిన దస్త్రాలను పరిశీలించి ఈ వివరాలు కనుగొన్నారు. ఇందులో మొత్తం 140 మంది పేర్లున్నాయి. జర్మనీ పత్రిక 'సుడియుషె జీతంగ్'లో వెల్లడైన వివరాల ప్రకారం, ఐసీఐజే (ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కన్సార్టియం) సుమారు ఏడాది పాటు పరిశీలించి వీరి పేర్లను బహిర్గతం చేసింది. వీరిలో 12 మంది మాజీ, తాజా దేశాధ్యక్షులు ఉన్నారు. లండన్ లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వారసులు భారీగా నల్లధనాన్ని దాచారని, వర్జిన్ ఐలాండ్స్ లో కంపెనీలు పెట్టారని తెలుస్తోంది. ఈ ఆస్తులను డచ్, స్కాట్లాండ్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి భారీగా రుణాలను తీసుకున్నారని సమాచారం. ఇక పుతిన్ విషయానికి వస్తే, ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా లబ్దిపొందిన మిత్రులు, సుమారు రూ. 13 వేల కోట్లకు పైగా (2 బిలియన్ డాలర్లు) డబ్బు పోగేసి వివిధ రూపాల్లో పుతిన్ కుటుంబానికి చేర్చారు. వీరితో పాటు చైనా ప్రధాని క్సీజింగ్ పింగ్, ఐస్ లాండ్ ప్రధాని, ఉక్రెయిన్ అధ్యక్షుడు, స్టార్ ఆటగాడు లియోనిల్ మెస్సీ, హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ తదితరులు పన్నులు ఎగ్గొట్టి విదేశాల్లో డబ్బు దాచుకున్నారని 'సుడియుషె జీతంగ్' పేర్కొంది. కాగా, జర్నలిజానికి సంబంధించినంతవరకూ ఇదే అతిపెద్ద, సంచలన లీక్ అని వికీలీక్స్ వ్యవస్థాపకుడు ఎడ్వర్డ్ స్నోడెన్ తన ట్విట్టర్ ఖాతాలో అభిప్రాయపడ్డారు.