: రాబోయే రోజులన్నీ ఇండియావే!: నరేంద్ర మోదీ


భవిష్యత్తులో ప్రపంచ పెట్టుబడులకు ఇండియా కేంద్రంగా నిలువనుందని, ఇన్వెస్టర్లకు స్వర్గధామంలా ఉన్న దేశంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొద్ది సేపటి క్రితం సౌదీ అరేబియాలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన, ఇండియాలో పెట్టుబడి అవకాశాలను గురించి ప్రసంగించారు. ఇండియాలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, విదేశాల నుంచి వచ్చే కంపెనీలకు సత్వర అనుమతులు ఇస్తున్నామని గుర్తు చేశారు. పన్ను విధానాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సవరించేందుకు చర్యలు చేపట్టామని మోదీ వెల్లడించారు. ఇప్పటి నుంచి పది సంవత్సరాల తరువాత కూడా ఒకే రకమైన పన్ను విధానం ఇండియాలో ఉంటుందని, విదేశీ కంపెనీలు ఏ మాత్రం సంకోచం లేకుండా రావచ్చని తెలిపారు. దీర్ఘకాల ఏకరూప పన్ను విధానానికి కట్టుబడి వున్నామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విధానం అమలుతో ప్రపంచ పెట్టుబడుల చిత్రపటంపై ఇండియా దేదీప్యమానంగా వెలగనుందని అంచనా వేశారు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను అమలు చేస్తున్నామని, సరైన కంపెనీలకు రుణ లభ్యతను మరింత పారదర్శకం చేశామని తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ కలుపుకుని ముందుకు సాగుతున్నామని, దేశంలోని ఏ ప్రాంతాన్నైనా పెట్టుబడులు పెట్టేందుకు ఎంచుకోవచ్చని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News